Search This Blog

Monday 23 April 2012

చంద్ర బలం

ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు పరిశీలించవలసిన ముఖ్యమైన విషయాలలో చంద్రబలం ఒకటి. ముహూర్త సమయానికి చంద్రుడు ఉన్న రాశిని బట్టి బలాన్ని నిర్ణయించాలి. ఎవరికొరకు ముహూర్తం చూస్తున్నామో వారి జన్మ రాశినుండి, ముహూర్తం నిర్ణయించదలచిన రోజున చంద్రుడు ఉన్న రాశివరకు లెక్కించాలి.

జన్మ రాశినుండి ముహూర్త సమయ చంద్రరాశి
శుక్ల పక్షంలో :  2-5-9
క్రిష్ణ  పక్షంలో :  4-8-12
శుక్లపక్షం, క్రిష్ణ పక్షం రెండిటిలోనూ : 1,3,6,7,10,11 అయితే మంచిది.

అనగా శుక్లపక్షంలో చంద్రుడు  4-8-12 స్థానాలలో ఉంటే ఆ ముహూర్తానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.
కృష్ణ పక్షంలో చంద్రుడు 2-5-9 స్థానాలలో ఉంటే ఆ ముహూర్తానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.

ముహూర్తం చూడడం ఎలా?


శ్లో// చక్షుషే జగతాం కర్మసాక్షిణే తేజసాంనిధేః
మూర్తి త్రయ స్వరూపాయ మార్తాండాయ నమోనమః//

          మనం ఒక అధికారి దగ్గరికి పనిమీద వెళ్లేటప్పుడు ఆ అధికారి కోపంలో ఉన్నాడా!?, సంతోషంలో ఉన్నాడా!? మొదలైన   విషయాలు తెలుసుకుని అతను సంతోషంలో ఉన్నప్పుడు వెళితే మన పని త్వరగా అవుతుంది. అలాగే తెలివైన వారు కాలం యొక్క స్వభావాన్ని తెలుసుకుని మంచి కాలములో తగిన పనులు చేయ తలపెడతారు. అన్నికాలాలూ మనకు జయాన్ని ఇవ్వవు. ఒక సమయంలో ఒకరికి శుభం జరిగితే మరొకరికి కష్టం కలగవచ్చు. మనం పుట్టిన సమయాన్ని బట్టి మనకు మాత్రమే ప్రత్యేకంగా సరిపడు కాలం తెలుసుకోవాలి. మనం పుట్టిన సమయానికి ఉన్న నక్షత్ర,లగ్న ములను బట్టి మనకు/ మనం తలపెట్టిన పనికి సరిపడు నక్షత్ర, లగ్న సమయాలు తెలుసుకుని ముందడుగు వేయడం జయాన్ని కలిగిస్తుంది.  కాలం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఋషులు మనకు అందించిన అద్భుత వరం “జ్యోతిష్య శాస్త్రం”. దీని ఆధారంగా మన జీవితంలో జరుగు వివాహము, ఉపనయనము, గృహప్రవేశము మొదలైన కర్మలను ఏ రోజు, ఏ సమయంలో జరుపుకోవచ్చో తెలుసుకొనవచ్చు.

ముహూర్తం చూసే ప్రక్రియలో ముఖ్యంగా ఈ క్రింధి విషయాలు గమనించాల్సి ఉంటుంది.
౧) తారా బలం, ౨) చంద్ర బలం, ౩) లగ్న బలం, ౪) పంచక రహితం, ౫) ఏకవింశతీ మహా దోషాలు
వీటి తో పాటు చివరిగా ఆయా క్రతువులకు పనికి వచ్చే తిథి, వార, నక్షత్రాలనే వాడామా లేదా అనే విషయం కూడా తప్పకుండా నిర్థారించుకోవాలి.

ఉదాహరణకు : మనం అడిగి మరీ పెట్టించుకునే “ఆదివారం”  గృహప్రవేశం, ఉపనయనం, వివాహం మొదలైనవాటికి తగిన వారంగా పేర్కొన బడలేదు. బుధ,గురు, శుక్రవారములు చాలా వరకు శుభకార్యములకు మంచివిగా పెద్దలు తెలిపారు.  అయితే వారము కన్నా తిథి, తిథికన్నా నక్షత్రము, నక్షత్రముకన్నా లగ్నమూ అత్యంత బలీయములు. కనుక నక్షత్ర, లగ్నములు అనుకూలముగా ఉన్నచో తిథివారములు మధ్యస్థముగా ఉన్ననూ స్వీకరిస్తుంటారు.

  ఒక పని ముఖ్యంగా వైదిక సంబంధమైన వివాహ గృహప్రవేశాది క్రతువులు చేయతలపెట్టినప్పుడు ఈ విషయాలు అన్నీ గమనించి శుద్ధపరచిన శుభముహూర్తములు  గ్రహించాలి. 

Friday 20 January 2012

తారాబలం చూడటం ఎలా?

   ముహూర్త నిర్ణయంలో ప్రథానమైనది తారాబలం.   ఏ చిన్న ముహూర్తానికైనా మన జన్మ నక్షత్రానికి సరిపోయే నక్షత్రమును మాత్రమే తీసుకోవాలి. జన్మ నక్షత్రం నుండి ముహూర్త సమయానికి ఉన్న నక్షత్రం వరకు లెక్కించగా వచ్చిన సంఖ్యను 9 చే భాగహరించాలి. వచ్చిన శేషాన్ని బట్టి ఫలితం క్రింది విదంగా నిర్ణయించాలి.

  1 వస్తే ‘జన్మతార’ అలా వరుసగా....
1) జన్మతార,  2) సంపత్తార,  3) విపత్తార, 4) క్షేమ తార, 5) ప్రత్యక్తార, 6) సాధన తార, 7) నైధన తార, 8) మిత్ర తార, 9) పరమమిత్ర తార.

ఇవేవో అశ్వని, భరణి, కృత్తికల వలే వేరే కొత్త తారలు అనుకోకండి.  ఆ 27  నక్షత్రాలకే మన జన్మతారను బట్టి ఈ తొమ్మిది పేర్లు అన్వయించాలి.  అంటే ‘విద్యార్థి’ అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు. అతను ఒకరికి కొడుకు, ఒకరికి తమ్ముడు, ఒకరికి భర్త అవుతాడు. అలాగే అశ్వనీ నక్షత్రం ఒకరికి జన్మతార అయితే, మరొకరికి సంపత్తార ( సంపదలు కలిగించే తార ) అవుతుంది.  మరొకరికి విపత్తార ( విపత్తులు కలిగించే తార ) అవుతుంది. ఎవరికి ఏమవుతుంది అన్నది వారి జన్మనక్షత్రాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. 

పైవాటిలో  సంపత్తార, క్షేమ తార, సాధన తార, మిత్ర తార, పరమమిత్ర తారలు ( 2,4,6,8, 9 తారలు ) సకల శుభకార్యాలు చేసుకోవడానికి పనికి వస్తాయి. వృత్తి,వ్యాపార సంబంధమైన విషయాలు ‘సంపత్తార’ లోను,  ప్రయాణాది కార్యాలు ‘క్షేమతార’ లోను, సాధించి తీరాలనుకునే కార్యాలు ‘సాధనతార’ లోను ప్రారంభించడం మరింత మంచిది.


జన్మతార కొన్ని శుభకార్యాలకు పనికొస్తుంది. కొన్నిటికి పనికి రాదు.

చెవులు కుట్టడం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, నిషేకం, యాగం, పట్టాభిషేకం, వ్యవసాయం, భూసంపాదన మొదలైన వాటికి జన్మతారను గ్రహించ వచ్చు.

ప్రయాణం, పెండ్లి, క్షౌరము, ఔషధ సేవనం, గర్భాదానం, శ్రార్థం, సీమంతం, పుంసవనము మొదలైనవి జన్మనక్షత్రంలో చేయరాదు.

ఉదాహరణ :  రేవతి నక్షత్రం జన్మ నక్షత్రం అనుకుంటే,  ముహూర్త నిర్ణయంరోజు పూర్వాభాద్ర నక్షత్రం ఉంది అనుకుంటే, రేవతికి పూర్వాభాద్ర సరిపోతుందో లేదో తెలుసుకోవాలి.   అంటే రేవతి నుండి పూర్వాభాద్ర ఎన్నో నక్షత్రమో లెక్క పెట్టాలి. 26 వ నక్షత్రం అవుతుంది. దానిని తొమ్మితో భాగహరించగా శేషం 8 వస్తుంది. అంటే రేవతికి - పూర్వాభాద్ర ఎనిమిదో తార ( మిత్ర తార ) అవుతుంది. అంటే శుభం కనుక ముహూర్తము పనికొస్తుంది.
శేషం సున్నా వస్తే అది తొమ్మిదిగా గుర్తించాలి.


తప్పని సరి పరిస్థితులలో ముహూర్తనిర్ణయం చేయవలసి వస్తే .....

ప్రథమే ప్రథమం త్యాజ్యం ద్వితీయేతు తృతీయకం
తృతీయే పంచమం త్యాజ్యం నైధనం త్రిషువర్జయేత్ !

ప్రథమ నవకం లో ( 1 నుండి 9 తారలలో ) మెట్ట మొదటి తారను, 
2 వ నవకం లో ( 10 నుండి 18 తారలలో ) మూడవ తారను, 
3 వ నవకంలో( 19 నుండి 27 తారలలో ) పంచమ తారను, 
ప్రతీ నవకంలో 7 వతారను ఎల్లప్పుడు   వదిలి పెట్టవలెను.

అంటే జన్మనక్షత్రము లగాయతు  1, 7, 12, 16, 23 మరియు 25 నక్షత్రాలను ఎల్ల వేళలా శుభకార్యములలో వదిలిపెట్టాలి.

అంటే సాధారణంగా జన్మ నక్షత్రం నుండి  1,3,5,7,10,12,14,16,19,21,23 మరియు 25 నక్షత్రాలను శుభకార్యములలో వదిలిపెట్ట వలసి ఉన్నది. కానీ కావలసిన సమయము లోపల ముహూర్తములు కుదరని పక్షమున 1, 7, 12, 16, 23 మరియు 25 తారలు మాత్రం వదిలి మిగతావి రెండవ ఎంపికగా గ్రహించ వచ్చును. 

Thursday 19 January 2012

ఫలానా సమయానికి ఏ లగ్నం ఉన్నదో తెలుసుకోవడం ఎలా?

      
                పంచాంగములో తిథి, వార, నక్షత్రాలు ఇచ్చి నట్లే లగ్నాంతకాలములు అని ఒకచోట ఇస్తారు. అవి అంతమయ్యే సమయాన్ని తెలుపుతాయి. ఉదాహరణ: జనవరి 19 వ తేదీ ఉదయం 06-26 నుండి 08-14 ని.ల వరకు  మకరలగ్నం ఉంది.

ప్ర : తరువాత ఏలగ్నం?
జ : ఇంకేమిటి ఉంటుంది? మకరం తరువాత కుంభమే  కదా! :) ఉదయం 09-53 వరకు కుంభలగ్నం ఉన్నది.

ప్ర : ఏలగ్నంతో రోజు ప్రారంభమౌతుంది అనడానికి లెక్కలేమైనా ఉన్నాయా?
జ : సూర్యుడు ఏరాశిలో ఉంటే ఆ లగ్నంతో రోజు ప్రాంరంభమౌతుంది. తరువాత వరుసగా లగ్నాలన్నీ మారుతూ వచ్చి మళ్లీ సూర్యోదయానికి తిరిగి అదే లగ్నంతో ప్రారంభమౌతుంది.

ప్ర : సూర్యుడు ఎన్ని రోజులు ఒక రాశిలో ఉంటాడు? మళ్లీ ఎప్పుడు వేరే రాశిలోకి మారతాడు?
జ :  సూర్యుడు సరిగ్గా ముప్ఫైరోజులు ఒక రాశిలో ఉంటాడు. సాధారణంగా ప్రతీనెలా 14 లేక 15 తేదీలలో రాశి మారుతుంటాడు. దీనినే సంక్రమణము అంటాము. అలాధనురాశిలోకి ప్రవేశించి నప్పుడే ధనుస్సంక్రమణం అంటాము.  అప్పుడే ధనుర్మాసం ప్రారంభమౌతుంది. తరువాత నెలకి మకర సంక్రమణం ( సంక్రాంతి పండుగ ) వస్తుంది.








ఫలానా సయానికి ఏ తిథి, వార, నక్షత్రాలు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా?

             జాతక చక్రం వేయడం తెలుసుకుందామనుకునే వారికి కలిగే మొదటి సందేహం ఇదే అనుకుంటాను. చాలా మందికి ఈ విషయం చిన్నప్పటి నుండే తెలిసి ఉంటుంది. కానీ ఇంకా ప్రాథమిక స్థాయికి వెళదామనిపించి ఈ విషయం కూడా తెలిపే ప్రయత్నం చేస్తున్నాను.  ఫలానా సయానికి ఏ తిథి, వార, నక్షత్రాలు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా?  సమాధానం చాలా తేలికైనది. మన తెలుగు కాలెండర్ లో ఉంటాయి ఈ వివరాలన్నీ. ఇంకా మంచి పద్ధతి ఏమిటంటే ఓ చక్కని పంచాంగం ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవడమే!  తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అను ఐదు ( పంచ ) విషయాల ( అంగాల ) గురించి వివరించునదే "పఞ్చాఙ్గము" మన ఆంధ్రులు చంద్రుని బట్టి లెక్కలు వేస్తారు. కనుక మనది చాంద్రమానము.

   సరే ఈ పఞ్చాఙ్గము లలో కూడా అనేక రకాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి గంటల పఞ్చాఙ్గము, ధృక్ ( సూర్య ) సిద్ధాంత పఞ్చాఙ్గము.  పూర్వంనుండీ వాడేవి గంటల పఞ్చాఙ్గములు. కానీ సరిఅయిన లెక్కలు వచ్చునవి, జ్యోతీష్యులు అంగీకరించునవి ధృక్ సిద్ధాంత పఞ్చాఙ్గములు.  తిథి, నక్షత్రాలు ఎప్పుడు ప్రారంభమౌతున్నాయి, ఎప్పుడు పూర్తవుతున్నాయి అనే విషయాలలో ఈ రెండింటికీ వ్యత్యాసాలు ఉన్నాయి.  ( నేను ఇంకా తెలుసుకోవాలి )

ప్రస్థుతానికి నేను వాడేది ధృక్సిద్ధాంత పంచాగము. అందులో  ‘పిడపర్తి వారి పంచాగము’ బాగుంటుంది. నేడు దానికి సరిపడు స్థాయిలో ‘కాలచక్రం’ అనే పంచాగము కుర్తాళం సిద్ధేశ్వర పీఠ ఆస్థాన సిద్ధాంతి గారైన శ్రీ పొన్నలూరి గార్గేయ దైవఙ్ఞ గారిచే రచింపబడున్నది.

సరే అటువంటి పంచాంగములో ఫలానా తేదీ నాడు ఏ తిథి, నక్షత్ర, యోగ, కరణములు ఎంతవరకు ఉన్నదీ అనే విషయం ఉంటుంది. సాధారణంగా అన్ని పంచాంగములలోనూ ప్రారంభ సమయాలు కాక, అంత్య సమయాలు ఇస్తారు.  ఇక వారం విషయం అందరకూ తెలిసినదే! కానీ ఆంగ్ల మానము ప్రకారం అర్థ రాత్రి 12 నుండి మళ్లీ అర్థ రాత్రి 12 వరకు వారము కాదు. సూర్యోదయము నుండి మరల సూర్యోదయము వరకు ఒకటే వారముగా గ్రహించాలి.  అలాగే తిథిని గ్రహించేటప్పుడు పూజలో సంకల్పానికి అయితే సూర్యోదయానికి ఎతిథి ఉంటే అదే తిథిని చెప్పాలి. కానీ ముహూర్త నిర్ణయానికి అయితే ఆసమయానికి ఏది ఉంటే అదే గ్రహించాలి.

Wednesday 18 January 2012

పంచకరహితం అంటే?

ఏదైనా ముహూర్తమును నిర్ణయించ దలచుకున్నప్పుడు ఆ ముహూర్తమునకు పంచక రహితం అయ్యిందో లేదో చూసుకోవాలి. ముహూర్త సమయానికి ఉన్న తిథి - వార - నక్షత్ర - లగ్న ములు అను నాలుగింటిని కలిపి తొమ్మిదిచే భాగించగా వచ్చిన శేషం 1 తప్ప మిగిలిన బేసి సంఖ్యలైతే శుభం.


అదే శేషం 1 అయితే మృత్యు పంచకం. ఇది అస్సలు మంచిదికాదు. ఆ ముహూర్తమునకు చేసే శుభకార్యము వలన మృత్యువు సంభవించ వచ్చును.
2  అయితే అగ్ని పంచకం. దీని వలన అగ్నిప్రమాదములు జరుగుతాయి.
4 అయితే రాజ పంచకం. అనుకోని అవాంతరాల వలన కార్యం ఆగిపోవచ్చు.
6 అయితే చోర పంచకం. కార్యక్రమంలో కొన్ని దొంగలచే దొంగిలించ బడతాయి.
8 అయితే రోగ పంచకం. కార్యక్రమంలో ప్రధాన వ్యక్తులు రోగముచే బాధపడతారు.

కనుక శేషంగా 1,2,4,6,8 అను ఐదు సంఖ్యలు ( పంచకములు ) వస్తే అవి శుభప్రదం కాదు. ఆముహూర్తమును వదిలి పెట్టవలెను.

అయితే తప్పని సరి పరిస్థితులలో .....

చోర రోగ త్యజే రాత్రౌ దివారాజాగ్ని మేవచ
అహోరాత్రం త్యజేత్ మృత్యుః పంచకాని విచారయేత్

అని చెప్పుటచే చోర, రోగ పంచకములను రాత్రి ముహూర్తంలో త్యజించాలి( పగలైతే ఉపయోగించ వచ్చును ). రాజ, అగ్ని పంచకములను పగటి ముహూర్తాలలో వదిలివేయాలి ( రాత్రి స్వీకరించ వచ్చును ). మృత్యు పంచకమును ఎల్లప్పుడూ వదిలివేయాలి.

మృత్యు, అగ్ని, రాజ, చోర, రోగ ములను ‘పంచకము’ అంటారు. ఇవి ‘రహితం’ చేసుకుని ముహూర్తము నిర్ణయించడాన్నే " పంచక రహితం " అంటారు. 

ఉదాహరణ : 19- 01-2012 సా.గం. 17-04  ఏదైనా శుభముహూర్తం నిర్ణయించాలనుకున్నాం. 
ఈ సమయానికి ( ముహూర్తానికి ) పంచక రహితం అయ్యిందో లేదో చూద్దాం. 

తిథి మొదలైనవి పంచాంగంలో చూసుకోవాలి.

19 తేదీ నాడు గురువారం, ఏకాదశి రా. 7.30 వరకు, అనూరాధ నక్షత్రం రా. 7-10 వరకు ఉన్నాయి. ఈ రోజు సా. 03-14 నుండి 05-26 వరకు మిథున లగ్నం ఉంది. 

వారం గురువారం - ఆదివారంనుంచి మొదలుపెడితే  గురువారం ఐదవది. అనగా దీని సంఖ్య 5 అవుతుంది.

తిథి సాయంత్రం 7-30 లోపే మన ముహూర్తం ఉంది కనుక ఏకదశి తిథినే తీసుకోవాలి. తరువాత అయితే ద్వాదశి తిథిని తీసుకోవాలి. ( కొందరు సూర్యోదయానికి ఉన్నతిథినే ఆ రోజంతా లెక్కించాలి అంటున్నారు. కానీ అది సరి అయినది కాదు. ఆ సమయానికి ఏ తిథి ఉంటే అదే తీసుకోవాలి. ) కనుక ప్రస్థుతం ఏకాదశి తిథి. అంటే పాడ్యమి నుండి మొదలు పెడితే ఏకాదశి 11 వ తిథి అవుతుంది. అనగా దీని సంఖ్య 11 అవుతుంది.

నక్షత్రం అనూరాధ.  అశ్వని మొదలు అనూరాధ 17 వ తార. కనుక దీని సంఖ్య 17 అవుతుంది.

లగ్నం మిథునం. మేషం మొదలు మిథునం 3 వ రాశి కనుక దీని సంఖ్య 3 అవుతుంది.

ఇప్పుడు ఇవన్నీ వరసగా రాసుకుని కూడదాం.

తిథి   +     వారము  +        నక్షత్రము +  లగ్నము
ఏకదశి +    గురువారం +    అనూరాధ +   మిథునం
11     +           5          +       17         +     3           =   36  దీనిని 9 తో భాగహరించాలి.

           9) 36 ( 4
               36
              -----
  శేషం       0   
              -----


సున్నా అంటే 9 గా భావించాలి. తొమ్మిది 'బేసి` సంఖ్యకనుక ఈ ముహూర్తానికి పంచక రహితం అయినది. 





Friday 2 December 2011

నక్షత్రాలు - రాశులు

      కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు. వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.  ఆ బిడ్డలకు తగిన వరునికొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు.  - అని పురాణ కథ  

ఈ క్రింద శ్లోకం నేర్చుకుంటే నక్షత్రాల పేర్లు, రాశుల పేర్లు పెద్ద కష్టపడకుండా నోటికి వస్తాయి. ఏనక్షత్రాలు ఎన్నో పాదం వరకు ఏ రాశిలో ఉన్నాయో చాలా సులభంగా గుర్తు ఉంటుంది.




అశ్వని భరణి కృత్తికా పాదో - మేషం 
కృత్తికాత్త్రయం రోహిణి మృగశిరార్థం - వృషభం 
మృగశిరార్థం ఆర్ద్రా పునర్వసుస్త్రయో - మిధునం
పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాన్తం - కర్కాటకం 
మఖ పుబ్భా ఉత్తరాపాదం - సింహం 
ఉత్తరస్త్రయో హస్త చిత్రార్థం - కన్య 
చిత్రార్థం స్వాతి విశాఖత్త్రయో - తుల 
విశాఖపాదో అనూరాధా జ్యేష్టాంతం - వృశ్చికం 
మూల పూర్వాషాడ ఉత్తరాషాడ పాదో - ధనుః 
ఉత్తరాషాడత్త్రయో శ్రవణం ధానిష్ఠార్థం - మకరం 
ధనిష్ఠార్థం శతభిషం పూర్వాభాద్రత్త్రయో - కుంభం 
పూర్వాభాద్రపాదో ఉత్తరాభాద్ర రేవత్యాంతం - మీనం



మేషం: అశ్విని మొత్తం, భరణి మొత్తం, కృత్తిక 1వ పాదం
వృషభం: కృత్తిక 2వ, 3వ, 4వ పాదాలు, రోహిణి మొత్తం, మృగశిర 1వ, 2వ పాదాలు
మిథునం: మృగశిర 3వ , 4వ పాదాలు, ఆర్ద్ర మొత్తం, పునర్వసు 1వ, 2వ ,3వ పాదాలు
కర్కాటకం: పునర్వసు4వ పాదం, పుష్యమి మొత్తం, ఆశ్లేష మొత్తం
సింహం: మఘ మొత్తం, పుబ్బ(పూర్వ ఫల్గుణి)మొత్తం, ఉత్తర(ఉత్తర ఫల్గుణి)1వ పాదం
కన్య: ఉత్తర(ఉత్తర ఫల్గుణి) 2వ,3వ,4వ పాదాలు, హస్త మొత్తం, చిత్త 1వ,2వ పాదాలు
తుల: చిత్త 3వ,4వ పాదాలు, స్వాతి మొత్తం, విశాఖ 1వ, 2వ, 3వ పాదాలు
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ మొత్తం, జ్యేష్ఠ మొత్తం
ధనుస్సు: మూల మొత్తం, పూర్వాషాఢ మొత్తం, ఉత్తరాషాఢ 1వ పాదం
మకరం: ఉత్తరాషాఢ 2వ,3వ,4వ పాదాలు, శ్రవణం మొత్తం, ధనిష్ఠ 1వ,2వ పాదాలు
కుంభం: ధనిష్ఠ 3వ,4వ పాదాలు, శతభిషం మొత్తం, పూర్వాభాద్ర 1వ, 2వ, 3వ పాదాలు
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర మొత్తం, రేవతి మొత్తం.